కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మద్దతు తెలుపుతున్న నలుగురు రాష్ట్ర మంత్రులకు కాలం మూడినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియాను ఎన్నుకొనే లాంఛనప్రాయ కార్యక్రమం పూర్తయ్యాక ఏ క్షణానైనా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని ఖాతరు చేయకుండా ఏకపక్షంగా జగన్ వర్గానికి మద్దతు పలుకుతున్న నలుగురు మంత్రులకు ఉద్వానస పలికే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కోస్తాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులు, రాయలసీమ , తెలంగాణల నుంచి ఒకొక్కరు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. పార్టీ వద్దన్నా జగన్ ఓదార్పు యాత్రకు మద్దతు పలికిన ఇద్దరు మంత్రులను తొలగించడం ఖాయం అంటున్నారు.
సెప్టెంబర్ 2న సోనియా పార్టీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవ ఎన్నికైన వెంటనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో నలుగురు మంత్రులను తొలగించడం ఖాయమని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్ని విషయం తెలిసిందే. కాగా, ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు.