వండర్ కార్

| No Comments | Labels : ,

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎంతసేపట్లో వెళ్లగలరు? విమానంలో అయితే.. రెండు గంటలు.. ట్రైన్‌లో అయితే.. కనీసం 24 గంటలు.. ఇక రోడ్డు మార్గంలో వెళ్లాలంటే.. రెండు మూడు రోజులు... కానీ.. ఆ కారులో ఎక్కారంటే గంటలోపే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు...

ఆ కారే.. బ్లడ్‌హాండ్ SSC.

గంటకు వెయ్యి మైళ్లు.. అంటే.. 1609 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగల సత్తా ఈ కారు సొంతం... చెప్పాలంటే.. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత వేగవంతమైన కారు ఇదే.. బుల్లెట్ వేగం మహా అయితే.. సెకనుకు మూడువేల అడుగులు. ఈ బుల్లెట్ వేగాన్ని దాటుకొని దూసుకువెళ్లగలికే కారే ఈ బ్లడ్‌హాండ్. కనురెప్పపాటులో దూసుకుపోయే తుపాకీ బుల్లెట్‌తో పోల్చితే 1.4 రెట్లు వేగంగా ఈ బ్లడ్‌హాండ్ పరుగులుపెడుతుంది. దుమ్మురేపుకుంటూ కళ్లముందే మాయమవుతుంది. జెట్ విమానంతోనూ ఇది పోటీ పడుతుంది. వేగంగా దూసుకుపోతూ.. నేలపై జెట్‌విమానాన్ని తలపిస్తుంది. ఒకవేళ ఈ రెండింటికీ పోటీ పెడితే.. జెట్ ప్లేన్‌ను ఓడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు..


చూడడానికి పెన్సిల్ ఆకారంలో ఉన్న ఈ బ్లడ్‌హౌండ్ కారు గంటకు వెయ్యి మైళ్ల వేగంతో దూసుకువెళుతుంది. అంటే.. గంటకు దాదాపు 1609 కిలోమీటర్ల వేగం అన్నమాట. పైగా.. ఈ బ్లడ్‌హౌండ్‌కున్న మరో స్పెషాలిటీ ఏమిటో తెలుసా.. ఈ అత్యధిక వేగాన్ని కేవలం 40 సెకన్లలోనే అందుకుంటుంది. అంటే.. కారును స్టార్‌చేసిన 40 సెకన్లలోనే మాగ్జిమమ్ స్పీడ్‌లో వెళ్లిపోవచ్చు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి దేశ రాజధానికి ఈ కారులో ప్రయాణిస్తే గంటలోపే చేరుకోవచ్చు. అంటే.. విమానం వెళ్లే వేగం కన్నా ఎక్కువన్నమాట.

అత్యంత వేగంగా వెళ్లడం కోసం ఈ బ్లడ్‌హౌండ్‌ను జెట్ ఇంజన్, రాకెట్ డిజైన్‌తో రూపొందించారు. అందుకే.. శబ్దవేగాన్ని దాటుకొని మరీ ఈ సూపర్‌సోనిక్ కారు.. ప్రయాణిస్తుంది. ఇటీవలే.. ఈ బ్లడ్‌హౌండ్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ కారు.. వచ్చే ఏడాదికల్లా ఫైనల్ టెస్ట్‌కు సిద్ధమవుతుంది. భూమిపై అత్యధిక వేగంతో ప్రయాణించిన రికార్డులన్నింటినీ తుడిపివేయాలన్నది దీని తయారీదారుల ఆలోచన. అందుకే.. ఊహకే సాధ్యంకానట్లు.. గంటకు వెయ్యిమైళ్ల వేగాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు.


మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కార్లతో పోల్చితే.. ఈ బ్లడ్‌హాండ్ పూర్తిగా డిఫరెంట్. 12.8 మీటర్ల పొడవు.. 6422 కిలోల బరువు.. బ్లడ్‌హాండ్ ప్రత్యేకత. అందుకే.. రూపులోనూ.. రూటులోనూ.. సాధారణ కార్లలా ఏ మాత్రం ఉండదు. గంటకు 1609 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి.. దీనికి ప్రత్యేకమైన రోడ్డు కావాల్సిందే. మన రోడ్లపై అడుగుపెడితే.. దీన్ని నడపడం చాలా కష్టం. ఎడారుల్లో మాత్రమే... ప్రస్తుతానికి దీన్ని నడిపే అవకాశం ఉంది. వేగం పెరిగే కొద్దీ.. రిస్క్ కూడా పెరుగుతుంది. వంద కిలోమీటర్ల వేగంతో వెళుతున్నప్పుడు అదుపు తప్పితేనే ప్రాణాలు దక్కడం కష్టం. అలాంటిది.. 1600 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నప్పుడు ఇంకెంత ప్రమాదమో ఊహించుకోండి. అయితే.. సేఫ్టీ విషయంలో ఏమాత్రం అనుమానపడక్కర లేదంటున్నారు బ్లడ్‌హాండ్ తయారీదారులు. దీని బాడీని టైటానియం, కార్బన్‌ఫైబర్‌తో తయారు చేశారు. అంతేకాదు మరెన్నో సెక్యూరిటీ ఫ్యూచర్స్ ఈ కారులో ఉన్నాయి. ప్రపంచంలోనే ఇంతవరకూ అత్యధిక వేగంగా ప్రయాణించిన కారు థ్రస్ట్ ఎస్‌ఎస్‌సి. బ్లడ్‌హాండ్‌ను తయారు చేస్తున్నవారే.. ఈ కారును తయారు చేశారు. 1997లో దీన్ని పరీక్షించారు. గంటకు 1228 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన థ్రస్ట్ SSC అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు.. ధ్వనివేగాన్ని దాటిన తొలికారుగా రికార్డునూ సృష్టించింది. 13 ఏళ్లవుతున్నా దీని రికార్డును ఇంతవరకూ ఎవరూ బ్రేక్ చేయలేదు. ఇప్పుడు బ్లడ్‌హాండ్‌ సక్సెస్ అయితే.. థ్రస్ట్ పేరిట ఉన్న రికార్డ్ చెరిగిపోతుంది. అంతేకాదు.. బ్లడ్‌హాండ్ సక్సెస్‌తో కార్ల తయారీలోనూ ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అత్యంత వేగంగా దూసుకువెళ్లే కార్లు తయారు కావచ్చు. థ్రస్ట్ సక్సెస్ అయ్యింది కాబట్టి.. 1600 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లగలిగే.. బ్లడ్‌హాండ్‌కూడా విజయం సాధిస్తుందన్న ధీమాలో ఉన్నారు పరిశోధకులు..

గూగుల్ డ్రైవర్ లెస్ కార్..
ఇంటర్నెట్ దిగ్గజ గూగుల్ గురించి తెలియనివారు ఉండకపోవచ్చు. సెర్చ్ ఇంజన్‌తో ప్రారంభమై, ఎంతో విస్తరించిన గూగుల్ ఇప్పుడు కార్లపై దృష్టి పెట్టింది. తనకున్న టెక్నాలజీని కార్లను మిక్స్ చేసి.. డ్రైవర్ లెస్ కార్లను తయారు చేయబోతోంది. అన్నీ అనుకూలిస్తే.. ఇక కారులో డ్రైవర్ లేకుండా.. స్టీరింగ్ పట్టుకోకుండానే జర్నీ చేసేయొచ్చు..


నగరాలు పట్టణాల్లో ఇప్పుడు కార్లదే హవా. బైక్‌ల ప్లేస్‌ను కార్లు వేగంగా ఆక్రమించేస్తున్నాయి. ప్రతీరోజు రోడ్లపైకి వస్తున్న కార్ల సంఖ్య రెట్టింపవుతోంది. కారులో షికారు హాయిగానే ఉంటుందనుకున్నా.. స్వయంగా డ్రైవ్ చేయాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. డ్రైవింగ్ చేయడం వల్ల రెస్ట్ మిస్ అవ్వడం ఓ సమస్య అయితే.. యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే మనరోడ్లపై సేఫ్ డ్రైవింగ్ మరో సమస్య. బాగా అలసిపోయినప్పుడు.. డ్రైవింగ్ చేయాలంటేనే చికాకు పుడుతుంది. కళ్లలో ఒత్తులు పెట్టుకుని నడిపితే తప్ప.. సేఫ్‌గా ఇంటికి చేరే అవకాశం ఉండదు. అలాంటప్పుడు.. అటోమెటిక్‌గా నడిచే కారు ఉంటే బాగుండని అందరికీ అనిపిస్తుంది. ఈ కోరికను త్వరలోనే తీర్చబోతోంది.. ఇంటర్‌నెట్ జెయింట్ గూగుల్. పూర్తిస్థాయి డ్రైవర్ లెస్ కారును తయారు చేసి టెస్ట్ చేస్తోంది.

ఇంతవరకూ హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించిన ఈ డ్రైవర్ లెస్ కార్లు త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నాయి. మానవ ప్రమేయం లేకుండా.. తనంత తానే పనిచేసే కారును డెవలప్ చేయగలిగింది గూగుల్. అమెరికా రోడ్లపై విస్తృతంగా దీన్ని పరీక్షిస్తోంది. కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో లాంటి రద్దీ రోడ్లపైనా ఈ గూగుల్ డ్రైవర్ లెస్ కారు పరుగులు తీసింది. మనుషులు ఏమాత్రం లేని చోట్ల 1600 కిలోమీటర్లకు పైగా.. మనుషులు తిరిగే చోట దాదాపు లక్షా 40 వేల కిలోమీటర్ల మేర టెస్ట్‌రన్‌ను సక్సెస్‌ఫుల్‌గా గూగుల్ కార్ పూర్తి చేసుకుంది. గూగుల్ ఇంజనీర్లను, మోస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ డ్రైవర్లను.. ఈ కారు సాటిస్‌ఫై చేసింది.
ఈ డ్రైవర్ లెస్ కారు అందుబాటులోకి వస్తే... యాక్సిడెంట్లు చాలావరకూ తగ్గిపోతాయి. అంతేకాదు.. ట్రాఫిక్ తగ్గట్లుగా వేగాన్ని మార్చుకోవడం వల్ల తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకోవచ్చని గూగుల్ చెబుతోంది. డ్రైవర్ లేకుండా కారు ఎలా పనిచేస్తుందన్నది మీ అనుమానమా..? దీనికోసం గూగుల్ ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసింది. ఇప్పటికే నెట్‌లో విశేష ఆదరణ పొందిన గూగుల్ మ్యాప్స్ట్, స్ట్రీట్‌వ్యూ ఆధారంగా గమ్యస్థానానికి మార్గాన్ని అటోమెటిక్‌గా సెట్ చేసుకుంటుంది. ఆరు టయోటా, ఓ ఆడి కారుకు ఈ ఎక్విప్‌మెంట్‌ను ఫిట్ చేశారు. ఇందులో కారు పైభాగంలో సెన్సార్లు ఉంటాయి. 360 డిగ్రీలో కోణంలో తిరుగుతూ.. 200 ఫీట్ల దూరంలోని ఆబ్జెక్ట్స్‌ను గుర్తిస్తూ.. దారి చూపడానికి 3Dమ్యాప్‌ను అప్పటికప్పుడు సిద్ధం చేస్తాయి. ఎడమవైపు వెనకచక్రంలో ఉండే మరో సెన్సార్.. కారు మూవ్‌మెంట్స్‌ను అబ్జర్వ్ చేస్తుంది. కారులో ఉండే వీడియో కెమెరా... ఎదురుగా ఎవరన్నా వస్తున్నారేమో కనిపెడుతుంది. రోడ్డుకు అడ్డంగా ఎవరైనా వచ్చినా.. కార్లు, ఇతర వాహనాలు అడ్డువచ్చినా.. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినా... ఆ సమాచారాన్ని కంప్యూటర్‌కు పంపిస్తుంది. దీని ఆధారంగా డ్రైవింగ్‌కు సంబంధించిన డెసిషన్స్‌ను కంప్యూటర్ తీసుకుంటుంది.

కమర్షియల్‌గా ఇలాంటి డ్రైవర్ లెస్ కార్లను తయారు చేసే విషయంలో మాత్రం గూగుల్ ఇంకా ఆలోచిస్తూనే ఉంది. నేరుగా కార్ మానుఫ్యాక్చరింగ్‌లోకి దిగకుండా.. కార్ల తయారీ కంపెనీలకు టెక్నాలజీని అందించడంపైనే దృష్టి పెట్టింది. ఈ టెక్నాలజీని కార్లలో పొందుపరిస్తే.. ఎలాంటి యాక్సిడెంట్లు జగవన్న నమ్మకం గూగుల్‌ది. ఇప్పటివరకూ చేసిన టెస్ట్‌లూ దీన్నే రుజువు చేశాయి. ఈ కారు అందుబాటులోకి వస్తే.. డ్రైవర్ల అవసరమే ఎవరికీ ఉండదు. కారులో ఎక్కి.. నిద్రపోతూ ఇంటికి చేరుకోవచ్చు. ట్రాఫిక్ వయోలేషన్స్.. యాక్సిడెంట్స్ అన్నవే ఉండవు..

ఎగిరే కారు



రోడ్డపైన తిరగడంతో పాటు.. గాల్లోనూ ఎగురగలిగే కారు పేరు ట్రాన్సిషన్. రోడ్డుపై వెళ్లినప్పుడు కారులా.. గాల్లో ఎగురుతున్నప్పుడు కారులా కనిపించడం దీని ప్రత్యేకత.. చాలా ఫ్లెక్లిబుల్ మోడల్ ఈ ట్రాన్షిషన్. అటు కారులా.. ఇటు ప్లేన్‌లా చాలా ఈజీగా మార్చుకోవచ్చు. అందుకే కాబోలు.. ట్రాన్సిషన్ అని పేరు పెట్టారు. కారులా వెళుతున్నప్పుడు దీని రెక్కలు ముడుచుకుని ఉంటాయి. కాబట్టి.. మామూలు కారులానే కనిపిస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా రోడ్డుపై వెళ్లిపోతుంది. ఇక విమానంలా మార్చాలని అనుకున్నప్పుడు ఓ చిన్న బటన్ ప్రెస్ చేస్తే చాలు.. రెక్కలు విచ్చుకుంటాయి. కారు కాస్తా.. ప్లేన్‌లా మారిపోతుంది.



అద్భుతంగా కనిపిస్తున్నఈ ట్రాన్సిషన్‌ను టెర్రాఫగియా అనే కంపెనీ తయారు చేసింది. ఇప్పటి వరకూ చేసిన అన్ని టెస్ట్ ఫ్లైట్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో త్వరలోనే విడుదల చేయాలని టెర్రాఫగియా భావిస్తోంది. పూర్తిస్థాయి కమర్షియల్ మోడల్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. 2011 చివరికల్లా మొదటి ట్రాన్సిషన్‌ను కస్టమర్‌కు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతోమంది ఈ ట్రాన్సిషన్‌ను కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఓ పైలెట్‌తో పాటు మరొకరు ఇందులో హాయిగా ప్రయాణించవచ్చు. కేవలం 20 గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉంటే చాలు ఈ కారును మీరే నడుపుకోవచ్చు. లైట్ స్పోర్ట్స్ క్రాఫ్ట్ విభాగంలో ఇప్పటికే దీనికి అనుమతులు కూడా వచ్చేశాయి.


టెర్రాఫగియా తయారు చేసిన ఈ ట్రాన్సిషన్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఇంథన వినియోగం. అన్ని విమానాల్లా.. దీనికి ప్రత్యేకమైన ఇంథనాన్ని వాడాల్సిన పనిలేదు. కార్లకు వాడుకునేలా సాధారణ పెట్రోల్ పోస్తే చాలు. రయ్యి రయ్యి మంటూ దూసుకుపోతుంది. మైలేజ్ విషయంలోనూ దీనికి తిరుగులేదు. ఆకాశంలో గంట ప్రయాణానికి 19 లీటర్ల పెట్రోల్‌ అవసరమవుతుంది. రోడ్డు ప్రయాణంలో మాత్రం లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.


సబ్‌మెరైన్ కార్.. కార్లు రూటు మార్చుకుంటున్నాయనడానికి నిదర్శనం స్కూబా కార్. పేరు కాస్త డిఫరెంట్‌గానే ఉన్నా... దాని పేరులోనే కారు చేయగలిగేదంతా ఇమిడి ఉంది. రోడ్డుపై దూసుకువెళ్లడమే కాదు.. నీటిలోనూ ప్రయాణించగల ఏకైక కారు.. ఈ స్కూబా. ఇంకా చెప్పాలంటే.. ఇదో జేమ్స్‌బాండ్ కార్. స్కూబా... ఆటోమొబైల్ రంగంలో ఓ సంచలనం. జేమ్స్‌బాండ్ సినిమాలకే పరిమితమైన అండర్‌వాటర్ కార్.. స్కూబా రాకతో నిజమయ్యింది. రోడ్డుపై దూసుకువెళ్లగల కారు.. .నీటిలో తేలుతూ ప్రయాణించగలదు. నీటిపై తేలడమే కాదు.. సబ్‌మెరిన్స్‌లా నీటి అడుగున కూడా ఏ ఇబ్బందీ లేకుండా ప్రయాణించగలదు. అండర్‌వాటర్ జర్నీలో కారులో ఉన్నవారికి ఏ ఇబ్బందిరాకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఆక్సిజన్ మాస్క్‌లు కూడా ఇందులో ఉంటాయి.



నీటిలో ప్రయాణం చేయడానికి వీలుగా దీనిలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం మూడు ఎలక్ట్రిక్ మోటర్స్ స్కూబాలో ఉంటాయి. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఒక మోటర్ పనిచేస్తే..మిగిలిన రెండూ నీటిలో ప్రయాణం చేసేటప్పుడు పనిచేస్తాయి. నీటిలో పది మీటర్ల లోతు వరకూ ఈ కారులో వెళ్లవచ్చు. నీటిపై గంటకు ఆరుకిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగే స్కూబా.. రోడ్డుపై మాత్రం గంటకు 120 కిలోమీటర్ల అత్యధిక వేగంతో ప్రయాణం చేయగలుగుతుంది. ఇక, స్కూబాకు ఉన్న మరో ప్రత్యేకత అటో డ్రైవింగ్. డ్రైవర్ లేకపోయినా.. దానంతట అదే వెళ్లిపోగలదు. మీకు డ్రైవింగ్ రాకపోయినా.. రూట్‌ను సెట్‌చేసి స్టార్ట్ చేస్తే చాలు.. కళ్లు మూసుకుని గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. పైగా, పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ కారు స్కూబా. ఎలక్ట్రిక్ బ్యాటరీలతోనే పనిచేస్తుంది కాబట్టి పొల్యూషన్ ప్రాబ్లం లేనేలేదు. ఎవరైనా అడ్డుగా వచ్చిన, రోడ్డుపై ఎదైనా అడ్డంగా ఉన్నా.. అటోమెటిక్‌గా స్కూబా ఆగిపోతుంది. యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలే ఉండవు. కార్లలో జేమ్స్‌బాండ్ కార్ కాబట్టి దీని ధర కాస్త ఎక్కువే. ఇప్పుడే కమర్షియల్ ప్రొడక్షన్ దశకు చేరుకుంది. అయితే.. ధరెంతన్నది మాత్రం కంపెనీ బయటపెట్టడం లేదు. కానీ, రోల్స్ రాయిస్ కన్నా మాది తక్కువ ధరే అంటోంది. అంటే అటూ ఇటూగా కోటి రూపాయలు ఉంటుందనడంలో సందేహం లేదు. బహుశా వర్షాకాలం మన హైదరాబాద్‌లో తిరగాలంటే ఈ కారునే తెచ్చుకుంటే బెటరేమో...

0 Responses to "వండర్ కార్"

Leave a Reply