కొండా సురేఖ, అంబటి రాంబాబు పార్టీ నుంచి వెలి?
కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు ఏమిటో తెలియక చుక్కాని లేని నావలా మారిన జగన్ పైకి తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తున్నప్పటికీ, లోపల మాత్రం ఆత్మరక్షణ ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల బలాన్ని చూపి అధిష్ఠా నాన్ని ఒకవైపు బెదిరిస్తూనే.. మరోవైపు రాజీబాటలో నడుస్తూ ద్విముఖ వ్యూ హంతో వెళుతున్నారు.
ఆయన వ్యవహారశైలి మేకపోతు గాంభీర్యాన్ని తలపి స్తోంది. అయితే ప్రస్తుత పరిణామాలు పరిశీలిస్తే జగన్ కథ చివరకు రాజీతో కం చికి చేరవచ్చని తెలుస్తోంది. తనను ధిక్కరిస్తున్న జగన్‌ను దారిలోకి తెచ్చేం దుకు ఇప్పటికే ఆయన, కుటుంబసభ్యుల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్న అధిష్ఠానం.. తాజాగా జగన్‌కు మద్దతుదారులైన ఎమ్మెల్యే కొండా సురేఖ, పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబును పార్టీ నుంచి వెలివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
దాని ద్వారా ఇక జగన్‌కు భవిష్యత్తులో ఎవరూ మద్దతు పలికేందుకు ముందుకు రారన్న లక్ష్యంతో వ్యూహరచన చేస్తోంది. దీని ద్వారా జగన్‌ను లొంగదీసుకోవచ్చని అంచనా వేస్తోంది. తన మద్దతుదారులపై వేట్లు పెరిగితే జగన్ తనంతట తాను వచ్చి లొంగిపోతారన్న వ్యూహం లేకపోలేదు. అదే సమయంలో జగన్ పార్టీలో ఉంటారా? లేదా? అన్నదీ తేల్చుకునేందుకు తానే రంగంలోకి దిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనయుడు ద్వారా జగన్‌తో సంప్రదింపులు ప్రారంభించింది.
కాగా, జగన్ వైపు నుంచి రాయబారాలు మొదలయినట్లు సమాచారం. హైదరాబాద్, బెంగళూరు, ముంబయికు చెందిన క్రైసవ మత ప్రముఖులతో పాటు.. వైఎస్ ఉండగా పోలీసు విభాగంలో హవా చెలాయించిన మాజీ డీజీపీ ఒకరు కలసి జగన్‌పై వేటు పడకుండా రక్షించేందుకు రంగంలోకి దిగినట్లు తెలిసింది. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడయిన ఆ మాజీ డీజీపీ చొరవతోనే ముగ్గురు క్రైస్తవ ప్రముఖులు సోనియా, రాహుల్ వద్దకు రాయబారానికి వెళ్లినట్లు సమాచారం.
ఈ విషయంలో వీరు ఇటలీలోని క్రైస్తవ మత ప్రముఖులతో చర్చించడమే కాకుండా, ఇంటర్నేషనల్ చర్చిస్ కౌన్సిల్‌ను కూడా దింపినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ వల్ల రాష్ట్రంలో క్రిస్టియానిటీ గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి చెందిందని, క్రైస్తవులంతా ఆయనను తమ కుటుంబసభ్యుల మాదిరిగా చూస్తున్నారని సోనియాకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ వేరు పడితే క్రైస్తవుల ఓట్లు చీలిపోతాయని కూడా నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా.. ఒకవైపు ఢిల్లీ నాయకత్వంతో పరోక్షంగా రాజీ ప్రయత్నాలు సాగిస్తూనే, మరోవైపు అధిష్ఠానంపై యుద్ధం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. అధిష్ఠానానికి తన అనుచరులు సంధిస్తోన్న లేఖాస్త్రాలు లీకయి, చివరకు అది తనకే ఎసరు పెట్టే పరిస్థితి రావడంతో జగన్ వ్యూహం మార్చుకున్నారు. ఇకపై ఎమ్మెల్యేలు రోజుకొకరు అధిష్ఠానానికి లేఖ రాయాలని నిర్ణయించినప్పటికీ.. మునుపటి మాదిరిగా వాటిని లీక్ చేయకూడదని తీర్మానించినట్లు సమాచారం.
అయితే.. కొండా సురేఖపై చర్యలు తీసుకున్న తర్వాతనే ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి లేఖలు రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈవిధంగా ఎంతమంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారో తామూ చూస్తామని జగన్ వర్గీయులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఇన్ని కార్యక్రమాలను వ్యూహాత్మకంగా నడిపిస్తున్న జగన్.. అంతే వ్యూహాత్మకంగా పార్టీ నాయకత్వంతో రాజీ కోసం తపనపడుతున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, లోపల మాత్రం భయంతోనే ఉన్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతిమంగా తన అవసరాల దృష్ట్యా జగన్ రాజీ పడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
www.123tollywoodcinemalu.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.