పొరపాటునో, గ్రహపాటునో సిఎంనయ్యా: రోశయ్య
పొరపాటునో, గ్రహపాటునో తాను ముఖ్యమంత్రినయ్యానని, అందువల్ల అన్ని విషయాలపై తనకు సమాచారం ఉండాలని లేదని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. మీడియా ముందు ఆయన మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2008 డిఎస్సీ అభ్యర్థుల నియామకంపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన అసహనానికి గురై తీవ్రంగా ప్రతిస్పందించారు. ఫైలుపై తాను ఐదు క్షణాల్లో సంతకం చేసి పంపించేశానని ఆయన చెప్పారు. అంతకు మించి మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. సంబంధింత మంత్రి ముఖ్యమంత్రిని అడగండని చెప్పారా అని ఆయన అడిగారు. నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాలు నిర్వహించవద్దనే ఆందోళనపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రావతరణ జరిగినప్పటి నుంచి నవంబర్ 1వ తేదీన ప్రభుత్వం ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఆ ఆనవాయితీని తప్పబోమని ఆయన చెప్పారు. ఇష్టం ఉన్నవారు అందులో పాల్గొనవచ్చు, ఇష్టం లేనివారు దానికి దూరంగా ఉండవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నంత వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ నివేదికనే ఫైనల్ అని, ఈ కమిటీ ఏర్పాటు తర్వాత మిగతా కమిటీలన్నింటికీ కాలం చెల్లిందని ఆయన అన్నారు. కమిటీ నివేదిక మేరకు రాష్ట్ర విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే స్నేహభావంతో విడిపోదామని ఆయన చెప్పారు. ఈలోగా ఒకరి పట్ల శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఫ్రీజోన్ పై తన ఇంటి ముందు ధర్నా చేస్తానని కెసిఆర్ అనడం సరి కాదని ఆయన అన్నారు. ఫ్రీజోన్ అంశంపై శాసనసభలో తీర్మానం చేశామని, ఈ విషయం కెసిఆర్ కు తెలుసునని, దానిపై పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కెసిఆర్ ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకుని పోవాలని ఆయన అన్నారు. చిదంబరంతో మాట్లాడి కెసిఆర్ అమలు చేయించుకోవాలని ఆయన అన్నారు.
తనను శ్రీవెంకటేశ్వర స్వామి రూపంలో చిత్రీకరించడంపై ఆయన బాధను వ్యక్తం చేశారు. తన అభిమానులు శ్రుతి మించి వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. పాలకొల్లులో రోశయ్య శాసనసభ్యురాలు బంగారు ఉషారాణి ఆధ్వర్యంలో రోశయ్యను శ్రీవెంకటేశ్వర స్వామి రూపంలో చిత్రించిన కటౌట్ ను ఏర్పాటు చేశారు. అది తనకు తెలియకుండా జరిగిందని ఆయన అన్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత తాను బాధపడ్డానని ఆయన చెప్పారు. తనను దేవుడితో పోల్చవద్దని ఆయన కోరారు. రోశయ్యను శ్రీవెంకటేశ్వర స్వామి రూపంలో చిత్రించడంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది హిందుపుల మనోభావాలను దెబ్బ తీస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు కార్యకర్తల అరాచకానికి ఇది పరాకాష్ట అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.